: సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు... వ్యక్తి జైలుపాలు!
వ్యక్తుల మధ్య సత్సంబంధాలకు ఉపయోగించుకోవాల్సిన సోషల్ నెట్వర్కింగ్ సైట్లను వ్యవస్థలపై విమర్శలకు వాడుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది! ముంబయిలో ద్వారకా హిరానందని (56) అనే వ్యక్తి న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లు చేశాడు. దీనిపై ఆగ్రహించిన బాంబే హైకోర్టు అతడికి ఓ నెల జైలుశిక్ష విధించింది. ఇలాంటి ఘటనల్లో అత్యధికంగా ఆర్నెల్ల జైలు శిక్ష విధించవచ్చని డివిజన్ బెంచ్ పేర్కొంది. పశ్చిమ అంధేరిలోని ఓ ఫ్లాట్ విషయమై హిరానందనికి, అతడి మరదలు అనితకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో హిరానందని వేసిన దావాను బాంబే హైకోర్టు సిటీ సివిల్ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో, అతడు హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేయడమే గాకుండా, న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశాడు.