: అరంగేట్రం మ్యాచ్ లోనే వరల్డ్ రికార్డు సృష్టించిన బంగ్లా బౌలర్
బంగ్లాదేశ్ యువకెరటం తైజుల్ ఇస్లాం ప్రపంచ రికార్డు సృష్టించాడు. జింబాబ్వేతో వన్డే మ్యాచ్ ద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తొలి మ్యాచ్ లోనే హ్యాట్రిక్ సాధించడం విశేషం. అరంగేట్రం మ్యాచ్ లోనే హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్ గా రికార్డు పుటలకెక్కాడు. ఈ మ్యాచ్ 27వ ఓవర్ చివరి బంతికి జింబాబ్వే బ్యాట్స్ మన్ తినాషే పన్యంగరాను బౌల్డ్ చేసిన తైజుల్, తన తర్వాతి ఓవర్ తొలి బంతికి జాన్ ఎన్యుంబును వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రెండో బంతికి తెందాయ్ చతారాను బౌల్డ్ చేయడంతో హ్యాట్రిక్ సాకారమైంది. మొత్తం 7 ఓవర్లు విసిరిన ఈ యువ స్పిన్నర్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కాగా, తాజా ఫీట్ తో తైజుల్ బంగ్లాదేశ్ తరపున హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్ గా అవతరించాడు. అటు, వరల్డ్ క్రికెట్లో ఈ ఘనత నమోదు చేసినవారిలో 45వ వాడయ్యాడు. ఇక, జింబాబ్వేతో మ్యాచ్ విషయానికొస్తే... మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తైజుల్ ధాటికి 128 పరుగులకే ఆలౌటైంది. అనంతరం, స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఆతిథ్య బంగ్లా జట్టు 24.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో విజయంతో బంగ్లాదేశ్ జట్టు వన్డే సిరీస్ ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది.