: నా కృషి మొత్తం భవిష్యత్ తరాల కోసమే: చంద్రబాబు
జపాన్ పర్యటనలో జెట్రో, జపనీస్ ట్రేడ్ ఆర్గనైజేషన్, జపనీస్ బ్యాంక్ ఆఫ్ కో ఆపరేషన్ వంటి సంస్థలను సందర్శించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పలు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులతో ఫలవంతమైన చర్చలు జరిపామని తెలిపారు. నకాటా వేస్ట్ మేనేజ్ మెంట్ ను సందర్శించి పనులను పర్యవేక్షించామని చెప్పారు. పలు విపత్తులతో జపాన్ దెబ్బతిన్నా... సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా పుంజుకుని, అభివృద్ధి చెందిందని అన్నారు. మన దేశ జీడీపీ కన్నా జపాన్ జీడీపీ రెండింతలు అధికంగా ఉందని చెప్పారు. కొన్ని కంపెనీలు జపాన్ చరిత్రనే మార్చేశాయని... అలాంటి కంపెనీలను మన రాష్ట్రానికి కూడా తీసుకొస్తే అద్భుతంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. రాజధాని కూడా లేనటువంటి పరిస్థితిలో మనం సంక్షోభంలో ఉన్నామని చంద్రబాబు అన్నారు. అద్భుతమైన రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తాను వివిధ దేశాలు తిరుగుతున్నానని చెప్పారు. మన రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అనేక దేశాలు ముందుకొస్తున్నాయని వెల్లడించారు. తాను చేస్తున్న కృషి మొత్తం భవిష్యత్ తరాల కోసమే అని తెలిపారు.