: హ్యూస్ కు నివాళిగా క్లబ్ టీం కెప్టెన్ అనూహ్య నిర్ణయం


ఆసీస్ యువ బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ మృతికి నివాళిగా ఈ క్లబ్ టీం కెప్టెన్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరచాడు. వివరాల్లోకెళితే... ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హాడాన్, డెలాకోంబ్ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. హాడాన్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా, కెప్టెన్ షాన్ మెక్ఆర్థర్ క్రీజులో ఉన్నాడు. జట్టు స్కోరు 408 పరుగులకు చేరుకోగానే షాన్ రిటైర్డ్ గా వెనుదిరగాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికతను 220 పరుగుల వ్యక్తిగత స్కోరు మీదున్నాడు. మరికొంత సేపు క్రీజులో ఉంటే, తన క్లబ్ కు ఓ రికార్డు సాధించిపెట్టేవాడే. జట్టు ఆల్ టైం అత్యధిక పరుగుల రికార్డు ఊరిస్తున్నా, షాన్ మాత్రం రిటైర్డ్ గా పెవిలియన్ కు మళ్లాడు. అందుకు కారణం ఉంది. '408' అనేది ఫిలిప్ హ్యూస్ టెస్టు జెర్సీ నెంబర్. దీంతో, స్కోరు బోర్డుపై 408/6 పరుగులు కనిపించగానే కెప్టెన్ షాన్ కు రిటైర్డ్ ఆలోచన వచ్చింది. అప్పటికి సరిగ్గా 63 ఓవర్లు పూర్తయ్యాయి. హ్యూస్ తన చివరి ఇన్నింగ్స్ లో చేసింది కూడా 63* పరుగులే. దీంతో, మరేమీ ఆలోచించకుండా ఈ కెప్టెన్ పెవిలియన్ చేరాడు. తొలుత అతడి నిర్ణయంతో షాక్ తిన్న క్లబ్ సహచరులు, అనంతరం అభినందించారు. దీనిపై హాడాన్ క్లబ్ ప్రతినిధి విన్సెంట్ మెక్ డోనాల్డ్ మాట్లాడుతూ, భారీస్కోర్లు చేసే అవకాశం ఎల్లప్పుడూ రాదని, అయితే, స్కోరుబోర్డుపై పరుగుల సంఖ్య చూడగానే షాన్ కు ఈ ఆలోచన వచ్చిందని, అమలు చేశాడని వివరించాడు.

  • Loading...

More Telugu News