: చిట్ ఫండ్ స్కాంలో ఒడిశా సీనియర్ ఐపీఎస్ ను ప్రశ్నించిన సీబీఐ
ఒడిశాలో కలకలం రేపిన చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజేశ్ కుమార్ ను సీబీఐ ప్రశ్నించింది. కుంభకోణంలో ఆయన పాత్రపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భువనేశ్వర్ లోని తమ ప్రాంతీయ కార్యాలయానికి రాజేశ్ కుమార్ ను పిలిపించిన సీబీఐ అధికారులు దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. గతంలో ఒడిశా క్రైం బ్రాంచ్ (ఆర్థిక నేరాల విభాగం) డీఐజీగా పనిచేసిన రాజేశ్ కుమార్ పేరు చిట్ ఫండ్ సంస్థ రికార్డుల్లో లభ్యమైన సంగతి తెలిసిందే. రాజేశ్ కుమార్ ను ప్రశ్నించే విషయంలో ఒడిశా ప్రభుత్వం చివరి నిమిషం దాకా సీబీఐని నిలువరించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. ‘సీబీఐ అడిగిన అన్ని విషయాలకు సంబంధించి నాకు తెలిసిన మేరకు వివరాలు అందించాను’ అని విచారణ అనంతరం రాజేశ్ కుమార్ చెప్పారు.