: అప్పుడు నదిలో ల్యాండయ్యాడు, ఇప్పుడు నడిరోడ్డుపై దిగాడు!


అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రానికి చెందిన డానీ హాల్ (48) కు విమానయానం అంటే మక్కువ. సొంత సింగిల్ ఇంజిన్ విమానంలో ప్రయాణాలు చేస్తూ ముచ్చట తీర్చుకుంటుంటాడు. టోరింగ్టన్ పట్టణవాసి అయిన హాల్ తాజాగా తన విమానంలో పయనిస్తూ అకస్మాత్తుగా పశ్చిమ హార్ట్ ఫోర్డ్ వద్ద నడిరోడ్డుపై దిగాడు. తన స్కైలైన్ సెస్నా విమానం ఇంజన్ లో సమస్యలు వచ్చాయని, అందుకే తాను నడిరోడ్డుపై ల్యాండవ్వాల్సి వచ్చిందని తెలిపాడు. ఆ సమయంలో తాను రాబర్ట్సన్ ఫీల్డ్ నుంచి హార్ట్ ఫోర్డ్-బ్రైనార్డ్ ఎయిర్ పోర్టుకు వెళుతున్నానని హాల్ చెప్పాడు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేసే సమయంలో హార్ట్ ఫోర్డ్ ఎయిర్ పోర్టు ఏటీసీతో హాల్ రేడియో ద్వారా మాట్లాడాడట. ల్యాండ్ చేసే సమయంలో ప్రమాదం సంభవిస్తే, చివరి సందేశంగా, వారినెంతగానో ప్రేమిస్తున్న విషయం తన పిల్లలకు తెలియజేయాలని కంట్రోలర్ కు చెప్పాడట. అయితే, అదృష్టవశాత్తు అతను సురక్షితంగా బయటపడ్డాడు. మెడకు చిన్న దెబ్బ తగిలింది. కేవలం బస్సులు మాత్రమే తిరిగే ఆ రహదారిపై విమానం క్రాష్ ల్యాండింగ్ చేసిన వెంటనే, నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు హాల్. పైకప్పుల తయారీ సంస్థకు యజమాని అయిన హాల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2008లో, విధిలేని పరిస్థితుల్లో నదిపై విమానాన్ని దించాడు. రోడ్ ఐలాండ్ లోని పాకాటుక్ నదిపై సురక్షితంగా ల్యాండయ్యాడు. కాగా, తాజా ప్రమాదంపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తుకు తెరదీసింది.

  • Loading...

More Telugu News