: సెల్ఫీ మోజు ప్లాస్టిక్ సర్జరీ డిమాండ్ ను పెంచేస్తోంది!
సరదాగా మొదలైన సెల్ఫీ మోజు కొంత మంది ప్రాణాలను బలిగొని ప్రమాదకారిగా పరిణమించిందన్న ఆరోపణలు సద్దుమణిగాయో లేదో, అప్పుడే దాని మరో పార్వ్శం వెలుగు చూస్తోంది. సెల్ఫీ మోజులో తేలియాడుతున్న యువత ప్లాస్టిక్ సర్జరీల బాట పడుతోందట. ప్రస్తుతం ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు బాగా విస్తరించాయి. అదే సమయంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా శరవేగంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అప్పటిదాకా సొంత ఫొటోల అప్ లోడ్ విషయంలో కాస్త వెనకడుగు వేసిన యువత ఆయా సోషల్ వెబ్ సైట్లలో సెల్ఫీలను చూసి తమ నిర్ణయాలను మార్చేసుకుంటున్నారు. ముఖారవిందం బాగా లేదనుకుంటున్న యువత సెల్ఫీలు తీసుకోవాలన్న యావతోనే ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ల బాట పడుతున్నారట. గడచిన రెండేళ్ల కాలంలోనే ఇలా తమ వద్దకు వస్తున్న యువత 25 శాతం మేర పెరిగిందని అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్లు చెబుతున్నారు. ఐఫోన్ తో క్లినిక్ లకు వస్తున్న సదరు యువతీయువకులు, ఆ ఫోన్లలో తమ సెల్పీలతో పాటు ఫేస్ బుక్ లోని ఇతరుల సెల్ఫీలను చూపుతూ, వారిలాగే తమ మోమును కూడా కాస్త సరిదిద్దండంటూ కోరుతున్నారట. దీంతో ప్లాస్టిక్ సర్జన్లు కూడా సదరు యువతకు చిన్నపాటి సర్జరీలు చేసేసి, భారీగానే లాభాలు ఆర్జిస్తున్నారట.