: జూడాల సమ్మె... తెలంగాణలో ముగిసింది, ఏపీలో జోరందుకుంది!
జూనియర్ డాక్టర్ల సమ్మె తెలంగాణలో ముగిసింది. అటు, ఆంధ్రప్రదేశ్ లో జోరందుకుంది. దాదాపు 60 రోజులకు పైగా తెలంగాణలో సమ్మె కొనసాగించిన జూడాలు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. సమస్యల పరిష్కారంలో తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలపై తమకు విశ్వాసముందని ప్రకటించిన జూడాలు, ఆదివారం నుంచి విధులకు హాజరవుతామని వెల్లడించారు. సమ్మె విరమించాలని పలుమార్లు ప్రభుత్వం, హైకోర్టు చేసిన సూచనలను తిరస్కరించిన జూడాలు శనివారం ఉన్నట్లుండి సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఏపీలో ఇటీవలే ప్రారంభమైన జూడాల సమ్మె నానాటికీ జోరందుకుంటోంది. ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జూడాలు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. తొలుత, ప్రభుత్వంతో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగిన నేపథ్యంలో త్వరలోనే జూడాల సమ్మె ముగుస్తుందన్న భావన వ్యక్తమైంది. అయితే, పరిస్థితి చక్కబడకపోగా, మరింత విషమించింది. 48 గంటల్లోగా సమ్మె విరమించాలన్న ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరికను జూడాలు బేఖాతరు చేశారు. ఈ నేపథ్యంలో, ఏపీలో జూడాల సమ్మె ఎప్పుడు ముగుస్తుందో ఊహించడమే కష్టంగా మారింది