: రాజ్ నాథ్ సమీక్షలో సీబీఐ చీఫ్ కునుకు!
మూలిగే నక్కపై తాటికాయ పడటమంటే ఇదేనేమో. ఇప్పటికే ఇంటా, బయటా ప్రతికూల పరిస్థితులతో సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హా నానా పాట్లు పడుతున్నారు. ఇవి చాలవన్నట్లు తన నేతృత్వంలోని సంస్థ చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఆయనకు మీడియా కెమెరాలు మరో షాకిచ్చాయి. దేశంలోని వివిధ పోలీసు విభాగాల ఉన్నతాధికారులతో హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని పోలీసు విభాగాల చీఫ్ లు అందరూ హాజరయ్యారు. సీబీఐ చీఫ్ హోదాలో రంజిత్ సిన్హా కూడా హాజరయ్యారు. అయితే, అందరూ రాజ్ నాథ్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ ఉంటే, సిన్హా మాత్రం నిశ్చింతగా ఓ కునుకు తీశారు. విషయాన్ని గమనించిన మీడియా కెమెరాలు తమ లెన్సులను ఆయనపైకి మళ్లించాయి. దర్యాప్తు విభాగాల అధిపతులు కాస్తంత జాగ్రత్తగా, అప్రమత్తంగా, మెలకువగా ఉండాలని రాజ్ నాథ్ చెబుతున్న సమయంలోనే సిన్హా కునుకు తీయడం గమనార్హం. సీనియర్ ఐపీఎస్ అధికారిగా కొనసాగుతున్న ఆయన డిసెంబర్ 2న పదవీ విమరణ చేయనున్నారు.