: విలీన మండలాల సమస్యలపై పది రోజుల్లోగా నివేదికివ్వండి: ఏపీ హోం మంత్రి
పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో, తెలంగాణ నుంచి ఏపీలో కలసిన ఏడు మండలాల సమస్యలపై ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దృష్టి సారించారు. ఏపీలో విలీనమైన మండలాల ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుని అల్లాడుతుంటే చోద్యం చూస్తున్నారా? అంటూ ఆయన అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంపచోడవరం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సందర్భంగా శనివారం హోం మంత్రి విలీన మండలాల సమస్యలపై మాట్లాడారు. పది రోజుల్లోగా విలీన మండలాల సమస్యలపై నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. విలీన మండలాల్లోని గ్రామాల్లో రూ.10 లక్షల చొప్పున నిధులతో అభివృద్ధి పనులు చేేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. విలీన మండలాల సమస్యలను అక్కడి ప్రజల నుంచి నేరుగా తెలుసుకునేందుకు డిసెంబర్ 9న ఏటిపాకలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.