: హాకీలోనూ క్రికెట్ 'బౌన్సర్' తరహా ముప్పు!


ఆస్ట్రేలియా యువ బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ మరణంతో క్రీడల్లో భద్రత చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ లోనే కాదు, హాకీలోనూ ఇలాంటి ముప్పే ఉందంటున్నారు నిపుణులు. ఆస్ట్రేలియా హాకీ జట్టు మాజీ కోచ్ రిక్ చార్లెస్ వర్త్ మాట్లాడుతూ, ముఖ్యంగా, డ్రాగ్ ఫ్లిక్ షాట్ ప్రాణాంతకం అంటున్నాడు. ఈ షాట్ ను కొనసాగిస్తే, హాకీ ప్రపంచం కూడా ఓ విషాదం కోసం వేచిచూస్తున్నట్టేనని అభిప్రాయపడ్డాడు. పెనాల్టీ కార్నర్ కొట్టే సమయంలో ఆటగాళ్లు నైపుణ్యం కంటే బల ప్రయోగానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని, దీని కారణంగా తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందని చార్లెస్ వర్త్ హెచ్చరించాడు. పెనాల్టీ కార్నర్ ను ఎదుర్కొనే సమయంలో గోల్ పోస్టు వద్ద ఆటగాళ్లు ఎలాంటి రక్షణ ఉపకరణాలు లేకుండానే ముందుకు ఉరుకుతుంటారని తెలిపాడు. క్రికెట్ లో 22 గజాల దూరం నుంచి బంతి దూసుకువస్తే, హాకీలో 12-13 గజాల దూరం నుంచే శరవేగంతో దూసుకువస్తుందని వివరించాడు. క్రికెట్లో బ్యాట్స్ మన్ శరీరానికి తగిన రక్షణ ఏర్పాట్లు ఉంటాయని, అదే, హాకీలో ఎలాంటి రక్షణ ఉండదని పేర్కొన్నాడు. హాకీలోనూ బేస్ బాల్ తరహా గ్రిల్డ్ మాస్క్ ధరించాలని తాను ఎప్పుడో ప్రతిపాదించానని ఈ ఆస్ట్రేలియన్ గుర్తు చేశాడు.

  • Loading...

More Telugu News