: సీబీఐ కొత్త చీఫ్ ఎవరవుతారో?
సీబీఐ ప్రస్తుత చీఫ్ రంజిత్ సిన్హా మరో నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో, కేంద్ర దర్యాప్తు సంస్థకు కొత్త అధిపతి ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ టాప్ పోస్టుకు ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రాజస్థాన్ డీజీపీ ఉమేంద్ర భరద్వాజ్, మహారాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాళ్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రకాశ్ మిశ్రా రేసులో ముందున్నారు. వీరి ప్రొఫైల్స్ ఇప్పటికే ప్రధానమంత్రి టేబుల్ పైకి చేరినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ లో రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కాగా, భరద్వాజ్, దయాళ్ ఇద్దరూ 1977 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. ఇక, మిశ్రా గతంలో ఎన్ఐఏ, ఎన్డీఆర్ఎఫ్ సంస్థల్లో పనిచేశారు. అంతేగాదు, సీబీఐలోనూ పనిచేసిన అనుభవం ఉంది. అయితే, 2006-2009 మధ్య మిశ్రా ఒడిశా స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించిన కాలంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ ఒడిశా విజిలెన్స్ విభాగం ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ అంశం కాస్త ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.