: ఇంతవరకు టీడీపీ సభ్యత్వం తీసుకోని జూనియర్ ఎన్టీఆర్
"శ్వాస ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతా... తాత పెట్టిన పార్టీ కోసం అహర్నిశలూ పనిచేస్తా" ఈ మాటలు ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నోటి నుంచి పదేపదే జాలువారుతుంటాయి. కానీ, ఇప్పుడు జూ.ఎన్టీఆర్ ప్రవర్తిస్తున్న తీరు అటు పార్టీ వర్గాలనే కాకుండా, సామాన్యులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. సందేహంలో పడేస్తోంది. ఎందుకంటే, టీడీపీ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తున్నప్పటికీ... జూనియర్ మాత్రం ఇంత వరకు పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. నవంబర్ 3వ తేదీన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. మరో వారం రోజుల్లో ఇది ముగియనుంది. సభ్యత్వాన్ని ప్రారంభించిన రోజు... తొలి సభ్యత్వాన్ని చంద్రబాబు తీసుకోగా, రెండో సభ్యత్వాన్ని హరికృష్ణ తీసుకున్నారు. కానీ, జూనియర్ మాత్ర్రం ఇంతవరకు సభ్యత్వ నమోదుపై ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. తన కుటుంబసభ్యులకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని జూ.ఎన్టీఆర్ భావిస్తున్నట్టు... తన తండ్రికి ఇంతవరకు ఎలాంటి పదవిని కూడా కట్టబెట్టలేదనే వేదనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు పార్టీలో అన్నీ తానై లోకేష్ వ్యవహరిస్తుండటం కూడా ఎన్టీఆర్ కు మింగుడుపడటం లేదని అనుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి చంద్రబాబు ఆహ్వానించడం... అదే సమయంలో తనను ఏమాత్రం పట్టించుకోకపోవడంపై కూడా ఎన్టీఆర్ కినుక వహించినట్టు చెబుతున్నారు.