: ముగ్గురు కామాంధులకు జీవితఖైదు
ముగ్గురు కామాంధులకు జీవిత ఖైదు విధిస్తూ చెన్నైలోని చెంగల్ పట్ మహిళా న్యాయస్థానం తీర్పుచెప్పింది. చెన్నై శివార్లలోని సిప్కాట్ ఐటీపార్కులోని టీసీఎస్ లో పనిచేస్తున్న ఉమామహేశ్వరిపై గత ఫిబ్రవరి 13న రామ్ మండల్, ఉత్తమ్ మండల్, ఉజ్జల్ మండల్ అనే వలస కూలీలు అత్యాచారం చేశారు. అనంతరం, ఆమెను హత్య చేశారు. దీనిపై విచారణ చేసిన సీబీసీఐడీ అధికారులు ఈ కేసు నిరూపణకు తాము చాలా కష్టపడినట్టు తెలిపారు. ఆమె మృతదేహం కనుగొనేందుకు తొలిసారి డ్రోన్ ను ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు. ఆమె డెబిట్ కార్డుతో డబ్బు డ్రా చేసిన ఓ వ్యక్తిని కనిపెట్టి, వారి కాల్ డేటా పరిశీలించి రామ్, ఉత్తమ్ ను విచారించారు. వారు నేరం అంగీకరించడంతో కోల్ కతా పారిపోయిన ఉజ్జల్ మండల్ ను వెతికిపట్టుకున్నారు. అనంతరం 51 మంది సాక్షులను, 119 ఎగ్జిబిట్లను, 61 వస్తువులను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించింది.