: హైదరాబాదు జగదీశ్ మార్కెట్ వద్ద మొబైల్ వ్యాపారుల ఆందోళన
ఆన్ లైన్ లో సెల్ ఫోన్ తదితరాల అమ్మకాలను తక్షణం నిలిపి వేయాలంటూ, హైదరాబాదులోనే అతి పెద్ద మొబైల్ మార్కెట్ గా పేరున్న అబిడ్స్ జగదీశ్ మార్కెట్ వద్ద పెద్ద సంఖ్యలో వ్యాపారులు ఆందోళన చేపట్టారు. వీరికి జంటనగరాల మొబైల్ రిటైల్ వ్యాపారుల సంఘాలు మద్దతు పలికాయి. ఆన్లైన్ మార్కెట్లో నోకియా తదితర సంస్థలు వారి వారి ఉత్పత్తులను కారుచౌకగా అమ్ముకుంటూ తమ పొట్టకొడుతున్నాయని నిరసన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కొన్ని బ్రాండ్ల ఉత్పత్తులను కేవలం ఆన్లైన్లో మాత్రమే విక్రయిస్తున్న విషయం తెలిసిందే. మధ్యలో ఎవరూ లేకపోవడంతో వీటి ధర చాలావరకు తగ్గుతోంది. ఇది రిటైల్ వ్యాపారులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే, సెల్ ఫోన్ వ్యాపారుల ధర్నా జరిగింది. దీంతో అబిడ్స్, కోఠి ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అవాంతరం ఏర్పడింది.