: టీటీడీలో రెవెన్యూ మంత్రి సిఫారసు లేఖ కలకలం
తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ జోక్యం నానాటికీ పెరిగిపోతోంది. వీఐపీ దర్శనాల కోసం ప్రజా ప్రతినిధులు చేస్తున్న సిఫారసులను అమలు చేయలేక టీటీడీ అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. తాజాగా ఏపీ రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి చేసిన సిఫారసు టీటీడీలో కలకలం రేపుతోంది. తన మనిషికి టీటీడీలో చోటు కల్పించాలని ఆయన చేసిన సిఫారసుపై ఎలా స్పందించాలో తెలియక అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. టీటీడీలో సామాన్య భక్తులకు సేవలందించే ఏజెంటుగా తన మనిషి నందకుమార్ కు అవకాశం కల్పించాలని ఆయన అధికారులకు లేఖ రాశారు. ఏజెంట్ల నియామకం కోసం ఏకంగా మంత్రులు సిఫారసు లేఖలు పంపుతుండటంపై అధికారులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా మంత్రుల స్థాయి నుంచి సిఫారసులు వెల్లువెత్తితే పని చేయడమెలాగంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.