: ఇక మొబైల్ స్టోర్లలోనూ జియోమీ ఫోన్లు!
చైనా మొబైల్ తయారీ దిగ్గజం జియోమీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వుంది. అతితక్కువ ధరకే మెరుగైన ఫీచర్లతో ఫోన్లను అందించడంలో ఆ సంస్థది ప్రత్యేక స్థానం. ఇక తన మొబైల్ ఫోన్ల విక్రయాల్లోనూ ఆ సంస్థ విధానాలూ ప్రత్యేకమే. కేవలం ఆన్ లైన్ విక్రయాలతోనే తన ఉత్పత్తి సామర్థ్యానికి మించి మొబైల్ హ్యాండ్ సెట్లను విక్రయిస్తున్న ఆ సంస్థ, ఆఫ్ లైన్ కొనుగోలుదారులను మాత్రం చేరుకోలేకపోయింది. కేవలం ఒక్క ఆన్ లైన్ విక్రయాల ద్వారానే ఊహించని డిమాండ్ కైవసం చేసుకున్న ఆ సంస్థ, ఆఫ్ లైన్ విక్రయాలు ప్రారంభిస్తే, ఇప్పటిదాకా నమోదైన రికార్డులన్నీ గల్లంతు కావడం ఖాయమే. అదే పని చేస్తోంది జీయోమీ. ఆఫ్ లైన్ విక్రయాల్లో భాగంగా త్వరలోనే భారత్ సహా పలు ప్రపంచ దేశాల్లోని మొబైల్ రిటైల్ స్టోర్లలో తన హ్యాండ్ సెట్ లను అందుబాటులోకి తెచ్చేందుకు జియోమీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రతి వారం జీయోమీ ఫోన్ల కోసం భారత్ లో 2-3 లక్షల మేర ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే నాడు ఒక్కరోజే 1.75 లక్షల రెడ్ మీ ఫోన్లు విక్రయమయ్యాయి. తాజాగా ఆఫ్ లైన్ విక్రయాలు ప్రారంభమైతే, దేశీయ మొబైల్ మార్కెట్ లో మెజారిటీ వాటాను చేజిక్కించుకోవడం తమకు అంత పెద్ద కష్టమైన పనేమీ కాదని జియోమీ సంస్థ ఇండియా హెడ్ మనూ జైన్ వెల్లడించారు.