: సచిన్ చివరిసారి క్రీజ్ లోకి వెళుతున్న ఫోటోకు ఉత్తమ అవార్డు
గత ఏడాది వాంఖెడె స్టేడియంలో ఆడిన టెస్టు మ్యాచే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు చివరిది. నాడు క్రీజులోకి వెళ్లేందుకు సచిన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి చేతులకు గ్లోవ్స్ తొడుక్కుంటూ బయటకు వస్తుండగా, మరోవైపు అభిమానులు తమ మొబైల్ కెమెరాల్లో తమ అభిమాన క్రికెటర్ ను బంధించేందుకు పోటీలుపడ్డారు. సరిగ్గా ఆ దృశ్యాన్ని ఓ ఫోటోగ్రాఫర్ అద్భుతంగా తన కెమెరాలో బంధించాడు. ఆ ఫోటోనే ఇప్పుడు 'బెస్ట్ పిక్చర్ ఆఫ్ ద ఇయర్-2013' అవార్డుకు ఎంపికైంది. ముంబయికి చెందిన 'మిడ్ డే' ఫోటో జర్నలిస్ట్ అతుల్ కాంబ్లే ఆ ఫోటోను తీశాడు. ఎంఎఫ్ఐ-యస్ బ్యాంక్ తాజాగా 4వ నేషనల్ ప్రెస్ ఫోటో కాంటెస్ట్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 240కి పైగా ఫోటో జర్నలిస్టులు తమ ఫోటోలను పంపారు. ఎనిమిదివేల వరకు వచ్చిన ఫోటోల్లో సచిన్ ఫోటోనే ఏకగ్రీవంగా ఎంపిక చేశారట. విజేత జర్నలిస్టుకు రూ.75వేల నగదు బహుమతి ఇవ్వనున్నారు.