: ఎస్పీజీ చీఫ్ దుర్గా ప్రసాద్ తొలగింపు... జసోదాబెన్ కు భద్రత అంశమే కారణమా?
ప్రధాని నరేంద్ర మోదీ నుంచి విడవడి వేరుగా ఉంటున్న భార్య జసోదాబెన్ కు భద్రత కల్పించడం, దానిపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ తర్వాత సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు... ఈ క్రమంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో, ఎస్పీజీ చీఫ్ గా కొనసాగుతున్న దుర్గా ప్రసాద్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికే ఎస్పీజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి దుర్గా ప్రసాద్, 2011 నుంచి ఎస్పీజీ చీఫ్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఉన్నట్టుండి ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా, దుర్గా ప్రసాద్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించడం గమనార్హం. అకస్మాత్తుగా బదిలీ చేయాల్సిన అవసరం లేకపోయినా, ఇతరత్రా కారణాలేమీ చెప్పకుండానే ఆయన బదిలీ ఆగమేఘాల మీద జరిగిపోయింది. దీనిపై విరుచుకుపడేందుకు కాంగ్రెస్ యత్నించినా, చివరి నిమిషంలో తన వైఖరిని మార్చుకుని సైలెంట్ అయిపోయింది. ఏపీ నుంచి సెంట్రల్ సర్వీసులకు వచ్చిన దుర్గా ప్రసాద్, సీఆర్పీఎఫ్ ప్రత్యేక డీజీగా విధులు నిర్వర్తిస్తూ, ఆ తర్వాత ఎస్పీజీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. మరి ప్రస్తుతం ఆయనను పాత కేడర్ పోస్టులో నియమిస్తారా, లేక కింద స్థాయికి దించుతారా? అన్న విషయం కూడా తేలలేదు.