: అగ్రపీఠంపై కన్నేసిన సైనా
ఇటీవలే చైనా ఓపెన్ నెగ్గి దూకుడు మీదున్న సైనా నెహ్వాల్ నెంబర్ వన్ ర్యాంకుపై కన్నేసింది. అంతర్జాతీయ వేదికలపై మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో సైనా ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో నాలుగోస్థానానికి ఎగబాకింది. ఒక్కసారిగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకోవడం విశేషం. దీనిపై సైనా మాట్లాడుతూ, "మూడు టైటిళ్లు సాధించి, తొమ్మిదో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకున్నాను. అందుకు సంతోషంగా ఉంది. వచ్చే నెలలో దుబాయ్ ఓపెన్ లో పాల్గొంటున్నా. అందులోనూ రాణిస్తానని భావిస్తున్నా" అని తెలిపింది. 2016 ఒలింపిక్స్ దిశగా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టానని తెలిపింది. "ఒలింపిక్స్ సమీపిస్తున్న తరుణంలో ఫిట్ నెస్ కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. చైనా అగ్రశ్రేణి త్రయాన్ని వీలైనన్ని సార్లు ఓడించేందుకు ప్రయత్నిస్తాను" అని పేర్కొంది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకునేందుకు కఠోరంగా శ్రమిస్తానని, అయితే, అందుకు కాలపరిమితి పెట్టుకోలేమని తెలిపింది.