: ఢిల్లీ వీధుల్లో మహిళ ఒంటరి ప్రయాణం... మగాళ్ల వెకిలితనం!
ఇటీవలే ఓ మహిళ న్యూయార్క్ వీధుల్లో ఒంటరిగా గంటల పాటు తిరగ్గా, మగాళ్ల నైజం వెల్లడైంది. ఎవరికి తోచిన రీతిలో వారు ప్రవర్తించారు తమ వెకిలితనాన్ని చాటుకుంటూ. అదే తరహాలో ముంబైలో ప్రయోగాత్మకంగా ఓ మహిళ ఒంటరిగా తిరగ్గా ఒక్క మగాడు కూడా కామెంట్ చేయలేదు. ఇప్పుడా తరహాలోనే ఢిల్లీలోనూ ఓ మహిళతో ఈ తరహా పర్యటన చేయించింది ఇండీ ట్యూబ్ సంస్థ. హాఫ్ ప్యాంట్స్, సింపుల్ బ్లాక్ టాప్, కళ్లకు క్రోమ్ హార్ట్స్ గాగుల్ తో కాస్త ఆకర్షణీయంగానే ఉన్న ఆ అతివ మొత్తం 10 గంటల పాటు ఢిల్లీ వీధుల్లో ఒక్కతే తిరిగింది. ఆమెకు ముందు సంస్థ ప్రతినిధి బ్యాక్ ప్యాక్ లో కెమెరాతో నడుస్తూ, ఘటనలను చిత్రీకరించాడు. తొలుత కన్నాట్ ప్లేస్ వద్ద ఓ మధ్యవయస్కుడు కుటుంబంతో వెళుతూ కూడా, వెనుదిరిగి మరీ చూడడం వీడియోలో కనిపించింది. ఎర్రకోట ప్రాంతంలో ఓ యువకుడు తన ఫ్రెండ్స్ తో ఏదో చెప్పి, అనంతరం ఆమెను ఫాలో అయ్యాడు. అతగాడు "విదేశీ యువతివా?" అని అడిగాడు. మరో ప్రాంతంలో ఓ యువకుడు ఆమెను చాలాసేపు వెంబడించాడు. ఇంకొకడు ఎలాంటి జంకు లేకుండా నేరుగా 'అప్రోచ్' అయ్యాడు. ఇక, పాలికా బజార్, సదరన్ ఎక్స్ టెన్షన్ వద్ద ఓ యువకుడు ఆమెతో మాట్లాడేందుకు తీవ్రంగా యత్నించడం వీడియోలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో, ముంబయిలోనే మహిళలకు భద్రత అధికమన్న విషయం స్పష్టమైంది. ఢిల్లీ... మహిళల పాలిట ఎంత భయానక ప్రాంతమో కూడా తేటతెల్లమైంది.