: వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జగపతినగరం గ్రామానికి చెందిన బొండా అప్పారావు అయ్యప్పమాల ధరించి శబరిమల వెళ్లి ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. అతను వచ్చేప్పటికి వివాహేతర సంబంధం కారణంగా గదిలో అతని భార్య బొండా కమల (28), అదే గ్రామానికి చెందిన రాకోటి సూరిబాబులు కలిసి ఉండటాన్ని చూశాడు. దీంతో కోపోద్రిక్తుడైన అప్పారావు ఇరువురిపైన కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో సూరిబాబు స్వల్ప గాయాలతో తప్పించుకుని పారిపోగా భార్య కమలను వెంటాడి నరికి చంపాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలను పక్కింటి వారికి అప్పజెప్పి కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటనతో వీరి పిల్లలు ఏడేళ్ల శశిధర్, ఐదేళ్ల శివకుమార్‌లు అనాధలయ్యారు. తల్లి మృతి చెందడం, తండ్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో బిత్తర చూపులు చూస్తున్న చిన్నారులను చూసి స్థానికులు కన్నీంటిపర్యంతమయ్యారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, గాయపడ్డ సూరిబాబును ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, కమల మృతదేహానికి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.