: పీసీని మోదీ ఎందుకు అభినందించారంటే...!
'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో సెలబ్రిటీలంతా పాల్గొంటున్నారు. కానీ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా (పీసీ) ముంబైలోని వెర్సోవాలో అగ్నిపథ్ షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రాంతాన్ని, అక్కడి పరిసరాలను గమనించారు. దుర్గంధం నిండిపోయిన పరిసరాల్లో చెత్తా చెదారాల్లో చిన్నపిల్లలు ఆడడం చూసిన ప్రియాంక కలత చెందినా మౌనంగా ఉండిపోయారు. ఇంతలో ప్రదాని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆమెను నామినేట్ చేశారు. దీంతో ఏం చేసినా పూర్తిస్థాయిలో చేయాలని పీసీ నిర్ణయించుకుంది. ఎంపిక చేసుకున్న సన్నిహితులతో కలసి వెర్సోవాలోని ఓ ప్రాంతాన్ని ఎంచుకుంది. అక్కడికి రాత్రుళ్లు వెళ్లి శుభ్రం చేసింది. ఆ ప్రాంతంలోని చెత్తను డోజర్, ట్రక్కులతో శుభ్రం చేయించింది. రోలర్ తో ఆ ప్రాంతాన్ని చదును చేయించి చుట్టుపక్కల ఉండే గుడిసెలకు రంగులు వేయించింది. దీంతో అది చక్కని మైదానంగా మారిపోయింది. దానికి అన్ని వైపులా మొక్కలు నాటింది. అంతటితో తన పనైపోయిందని భావించకుండా స్థానికులను పిలిచి, 'నేను చేయగలిగింది చేశాను. ఇకపై బాధ్యత అంతా మీదే'నని చెప్పింది. నెల రోజుల తరువాత చూస్తానని, పరిసరాలు శుభ్రంగా ఉంచేలా చూడాలని పిల్లల నుంచి పెద్దవారి వరకు అర్థమయ్యేలా చెప్పింది. అలాగే మరో తొమ్మిది మందిని 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి నామినేట్ చేసింది. ఆమె నామినేట్ చేసిన వారిలో ముంబైలోని టాక్సీ, ఆటోరిక్షా యూనియన్లు ఉండడం విశేషం. వీరు పూనుకుంటే ముంబై ఒక్కరోజులో తళతళలాడడం ఖాయం. అందుకే మోదీ పీసీని ప్రత్యేకంగా అభినందించారు.