: రాష్ట్రంలో పోరు... కేంద్రంలో దోస్తీ: బీజేపీతో శివసేన పొత్తులాట
దేశ రాజకీయాల్లో శివసేన కొత్త పొత్తులకు తెరతీసింది. రాష్ట్ర స్థాయిలో బీజేపీతో పోరు సాగిస్తూనే కేంద్రంలో మాత్రం ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకు నిర్ణయించుకుంది. ఈ తరహా రాజకీయ పొత్తులు దేశ చరిత్రలో దాదాపుగా లేవనే చెప్పాలి. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో పాతికేళ్ల నాటి మైత్రికి తిలోదకాలిచ్చిన శివసేన, ఆ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పరోక్ష కారణమైంది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సర్కారు ప్రవేశపెట్టిన బల పరీక్షకు వ్యతిరేకంగా ఓటేసిన శివసేన, కేంద్రంలోనూ మోదీ సర్కారుకు ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని విశ్లేషకులు భావించారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ శివసేన కేంద్ర ప్రభుత్వానికి ఆదివారం మద్దతు ప్రకటించింది. దాదాపు 37 కీలక బిల్లులు సభ ముందుకు రానున్న తరుణంలో శివసేన నిర్ణయం మోదీ సర్కారుకు సరికొత్త జవసత్వాలిచ్చేదే.