: ఏపీ కేబినెట్లో ముగ్గురికి స్థానచలనం?
అవశేషాంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న తపనతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతమంది మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా మంత్రుల పని తీరుపై ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో, ముగ్గురు మంత్రుల శాఖలను మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్ బాబులు చంద్రబాబు లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి ముగ్గురికీ త్వరలోనే స్థాన చలనం తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు తన శాఖకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా పొందలేకపోతున్నారనే భావనలో చంద్రబాబు ఉన్నారు. హోంమంత్రి చినరాజప్ప విషయానికి వస్తే... ఆయన ఇంతవరకు తన శాఖపై పట్టు సాధించలేకపోయారని, సమర్థవంతంగా పని చేయలేకపోతున్నారని సమాచారం. కాగా, బీజేపీతో టీడీపీ సంబంధాల విషయంలో కొద్ది రోజుల క్రితం కిషోర్ బాబు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించడమే కాక, రాజకీయంగా పెద్ద చర్చను లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో, వీరి శాఖలలో మార్పులు తథ్యమని తెలుస్తోంది.