: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పలు కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలన్న ప్రణాళికలతో అధికారపక్షం రంగం సిద్ధం చేసుకోగా, ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రతిపక్షాలు తమ వాదనలకు పదును పెడుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బీమా బిల్లు తదితర ముఖ్య బిల్లుల సవరణ విషయంలో ఏమాత్రం రాజీ పడరాదని కాంగ్రెస్ పార్టీ సహా పలు విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. అయితే, దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్న బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు నరేంద్ర మోదీ సర్కారు కూడా తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రతి అంశంపైనా చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని, సభను సజావుగా నిర్వహించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేటి నుంచి వచ్చే నెల 23 దాకా మొత్తం 22 రోజుల పాటు జరిగే సమావేశాల్లో 37 బిల్లులు సభ ముందుకు రానున్నాయి.