: అతని భార్యే అతడ్ని పట్టించింది...బ్యాంకు దొంగ అరెస్టు


వరంగల్ జిల్లా భూపాలపల్లి ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు చోరీకి పాల్పడిన బ్యాంకు అటెండర్ రమేష్ ను డీఐజీ మల్లారెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసును ఎలా ఛేదించింది వివరించారు. బ్యాంకు చోరీ పూర్తయిన తరువాత కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. వేసిన తాళాలు వేసినట్టే ఉండగా, నగలు, నగదు మాయం కావడం వెనుక బ్యాంకు సిబ్బంది హస్తం ఉండి తీరుతుందని భావించిన పోలీసులు, వారి నుంచే దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు సిబ్బందిని పలుమార్లు పలు రకాలుగా ప్రశ్నించారు. బ్యాంకు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. బ్యాంకు సిబ్బంది కదలికలపై ఓ కన్నేసి ఉంచారు. దీంతో రమేష్ భార్యను ప్రశ్నిస్తే చాలా విషయాలు తెలిశాయని, ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసును ఛేదించామని ఆయన వివరించారు. 34 కేజీల బంగారం, 21 లక్షల నగదును దొంగిలించి కరీంనగర్ జిల్లా అంబటిపల్లిలోని బంధువుల ఇంట్లో దాచాడని పోలీసులు గుర్తించారు. చోరీ సొత్తులోని 19 లక్షల రూపాయలు తీసుకుని తీర్థయాత్రలకు వెళ్లాడు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. అటెండర్ చేతికి విలువైన స్ట్రాంగ్ రూం తాళాలు ఎలా వెళ్లాయనే విషయాన్ని ఆరా తీస్తున్నామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News