: ఢిల్లీలో తెలుగు జాతి సత్తా చాటిన ఘనత ఎన్టీఆర్ దే!: రేవంత్ రెడ్డి
దేశ రాజధానిలో తెలుగు జాతి సత్తా చాటిన ఘనత దివంగత నేత నందమూరి తారక రామారావుదేనని టీడీఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా శనివారం ఎన్టీఆర్ ఘాట్ లో పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్షకు దిగారు. ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ సర్కారు వైఖరిపై మండిపడ్డారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసే దాకా ఢిల్లీలో తెలుగు వారిని మదరాసీలుగానే పరిగణించేవారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే ఢిల్లీకి తెలుగోడి సత్తా తెలిసిందన్నారు. కేసీఆర్ సహా నేడు కీలక పదవుల్లోని చాలా మందికి రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని ఆయన వెల్లడించారు.