: తీసుకెళ్లడానికి ఆయనొస్తే, వెళ్లేందుకు నేను రెడీ: మోదీ భార్య జశోదాబెన్
ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో వసంతం మళ్లీ వస్తుందా? మోడువారిన ఆయన వైవాహిక జీవితం మళ్లీ చిగురిస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి. అయితే, మోదీ నుంచి విడివడి వేరుగా ఉంటున్న భార్య జశోదాబెన్ ఇప్పుడు సానుకూల సంకేతాలు పంపుతున్నారు. భర్తతో కలిసి జీవించేందుకు తాను సిద్ధమేనంటున్నారు. ఇన్నాళ్ల నిశ్శబ్దాన్ని వీడి మీడియాతో తన కాపురంపై మాట్లాడారు. తనను తీసుకెళ్లడానికి ఆయనొస్తే వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని జశోదా స్పష్టం చేశారు. మోదీకి వివాహం అయిందన్న సంగతి వడోదర లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసే సమయంలో వెల్లడైంది. 1968లో టీనేజర్లుగా ఉన్నప్పుడు మోదీ, జశోదాలకు వివాహమైంది. అనంతరం కొంతకాలానికి వారు విడిపోయారు. రాజకీయాలతో మోదీ, ఉపాధ్యాయురాలిగా ఆమె తమ ఒంటరి ప్రస్థానం కొనసాగించారు. ప్రస్తుతం, గుజరాత్ మెహ్సానా జిల్లాలోని ఈశ్వర్ వాడ గ్రామంలో తన ఇద్దరు సోదరులతో కలిసి జశోదా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఇటీవలే ఆమెకు ఎస్పీజీ రక్షణ కల్పించారు.