: ఓబులేసు కాల్పులకు పాల్పడిందెట్లనిన...!
ఈనెల 12వ తేదీ ఉదయం అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై హత్యాయత్నం చేసిన ఓబులేసును పోలీసులు మీడియా మందు ప్రవేశపెట్టారు. ఓబులేసు ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడని హైదరాబాదు నగర కమిషనర్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓబులేసు దుర్వ్యసనాలకు బానిసై, తేలిగ్గా డబ్బును సంపాదించాలనే లక్ష్యంతో అమ్యూనియేషన్ లో ఉండే లోడెడ్ ఏకే 47 రైఫిల్ ను దొంగిలించాడని ఆయన చెప్పారు. పోలీసు ఆయుధ విభాగంలో వారానికోసారి వెపన్స్ క్లీనింగ్ చేస్తారని ఆయన తెలిపారు. క్లీనింగ్ చేసిన ఆయుధాలను ఆయుధాగారంలో డిపాజిట్ చేస్తారు. గత డిసెంబర్ లో క్లీనింగ్ రోజున ఓబులేసు మిగిలిన యూనిట్ల వారితో కలిసి ఆయుధాగారంలోకి ప్రవేశించి, లోడెడ్ ఏకే 47 రైఫిల్ ను ఓవర్ కోట్ లోపల పెట్టుకుని వెళ్లిపోయాడు. అయితే అది వేరే యూనిట్ కి సంబంధించిన వెపన్ కావడం, సంబంధిత యూనిట్ కి మూడు రోజులు సెలవు ఉండడంతో జరిగిన దొంగతనం గుర్తించలేదు. దీనిని బ్యాగ్ లో పెట్టుకుని ఓర్వకల్లు గుట్టల్లో దాచాడు. గత ఫిబ్రవరిలో నిజామాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని గన్ తో బెదిరించి పది లక్షల రూపాయలు వసూలు చేశాడు. అలాగే డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి, డబ్బు దండుకోవాలనే లక్ష్యంతో గన్ తో ముందురోజు సాయంత్రం కేబీఆర్ పార్క్ చేరుకుని, పార్క్ బయటున్న చెట్లలో దాక్కుని తనకు కావాల్సిన వ్యక్తి కోసం ఎదురు చూశాడు. పార్క్ లో వాకింగ్ చేసేందుకు లగ్జరీ కారులో వచ్చిన నిత్యానందరెడ్డి కదలికలను గమనించి, అతని కారులోకి ఎంటరై తుపాకి చూపించి, కారును బయటికి తీయాలని బెదిరించాడు. ఒక్కసారిగా ఆగంతుకుడ్ని చూసిన నిత్యానందరెడ్డి తుపాకీ బారెల్ ను పట్టుకుని పక్కకి నెడుతూ అరవడం ప్రారంభించాడు. నిత్యానందరెడ్డి పెనుగులాడుతాడని, పెద్దగా అరుస్తాడని ఊహించని ఓబులేసు ట్రిగ్గర్ నొక్కాడు. ఇంతలో వాకింగ్ చేస్తూ నిత్యానందరెడ్డి అరుపులు విన్న అతని సోదరుడు ప్రసాద్ రెడ్డి వచ్చి ఓబులేసును వెనుక నుంచి పట్టుకున్నాడు. దీంతో, ప్రసాద్ రెడ్డి చేయి కొరికి, నిత్యానందరెడ్డిని తోసేసి పారిపోయాడు. ఈ క్రమంలో గన్ కిందపడిపోయింది. దీనిని ఆధారం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, పకడ్బందీగా దర్యాప్తు చేశారు. దానికి తోడు కేబీఆర్ పార్క్ బయటున్న సీసీటీవీ ఫుటేజ్ దొరకడంతో ఓబులేసు అడ్డంగా దొరికిపోయాడు. కమెండో కావడం, దాక్కోవడం (గెరిల్లా పోరాట తీరు) తెలిసిన వ్యక్తి కావడంతో పట్టుకునేందుకు కొంత సమయం తీసుకుందని పోలీసులు వెల్లడించారు.