: ప్రపంచం భారత్ వైపు గొప్ప గౌరవభావంతో చూస్తోంది: మోదీ
విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తన బ్లాగులో పలు అంశాలను పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు గొప్ప గౌరవభావం, అపారమైన ఉత్సుకతతో చూస్తోందని తెలిపారు. తన విదేశీ పర్యటన ఫలితాలను వివరిస్తూ... నల్లధనంపై పోరుకు జి20 దేశాలు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చాయన్నారు. తన 10 రోజుల పర్యటనలో 38 మంది ప్రపంచ నేతలను కలిశానని, 20 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించానని బ్లాగులో తెలిపారు. ద్వైపాక్షిక భేటీల సందర్భంగా ఓ విషయం గమనించానని, అదేంటంటే, ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని, భారత్ తో సంబంధాల కోసం తహతహలాడుతోందని పేర్కొన్నారు. వాణిజ్య సంబంధాల బలోపేతం, భారత్ కు పెట్టుబడులను ఆకర్షించడమే ముఖ్యోద్ధేశంగా తన విదేశీ పర్యటన సాగిందన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' పట్ల అనేకమంది నేతలు ఆసక్తి చూపారని మోదీ పేర్కొన్నారు. దీన్ని సానుకూల సంకేతంగా భావిస్తున్నట్టు ఆయన తన బ్లాగులో తెలిపారు.