: 'మిస్డ్ కాల్' వ్యవహారం నాటుతుపాకుల వరకు వెళ్లింది!


ఓ మిస్డ్ కాల్ రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు కారణమైంది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోని పర్తాపూర్ జీవన్ సాహి ఏరియాలో నివసించే మోబిన్ అనే వ్యక్తి సెల్ ఫోన్ కు ఓ మిస్డ్ కాల్ వచ్చింది. తిరిగి కాల్ చేస్తే స్పందన కనిపించలేదు. వెంటనే, తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ చేయగా, అవతలి వ్యక్తి స్థానికుడే అని తేలింది. అతడి కుటుంబంతో మోబిన్ కుటుంబానికి ఎప్పటినుంచో గొడవలున్నాయి. దీంతో, మోబిన్, అవతలి వ్యక్తి ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకున్నారు. తీవ్ర హెచ్చరికలు చేసుకున్నారు. ఈ ఫోన్ వాగ్యుద్ధం అనంతరం, ప్రత్యర్థి కొందరు వ్యక్తులను వెంటేసుకుని వచ్చి మోబిన్ నివాసంపై దాడికి దిగాడు. వారు లైసెన్స్ డ్ నాటు తుపాకులతో మోబిన్ ఇంటిపై కాల్పులు జరిపారు. దీంతో, మోబిన్ కుటుంబం ఇజ్జత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కాల్పులకు దిగిన వారిని చెదరగొట్టారు. పరిస్థితి సద్దుమణిగిందనుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే, మోబిన్ ప్రత్యర్థి ఈసారి మరింత మందితో దాడి చేశాడు. వారు కిటికీలు పగులగొట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాకుండా, ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన టూ వీలర్లకు నిప్పు పెట్టారు. వారించబోయిన వ్యక్తులను మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా కొట్టారు. ఈ ఘర్షణలో అరడజను మందికి గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. దీంతో, భారీ ఎత్తున పోలీసులు బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దాయి. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News