: కేంద్ర నిర్ణయం తెలంగాణను కించపరిచేదే: కేసీఆర్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణను కించపరిచేదేనని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ విషయంపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలను సమర్థించిన అనంతరం మాట్లాడిన కేసీఆర్, రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రకు చెందిన వ్యక్తి పేరును తెలంగాణలోని టెర్మినల్ కు పెట్టడం తమను కించపరిచినట్టేనన్నారు. తెలంగాణలోనూ దేశానికి సేవ చేసిన ప్రముఖ నేతలున్నారని, వారిలో ఏ ఒక్కరూ కేంద్రానికి గుర్తు రాలేదా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టినా తాము అభ్యంతరపెట్టేవారం కాదన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై కొనసాగిన ఆంధ్రా పెత్తనం, రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగుతోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ తరహా పెత్తనాన్ని ఇకపై ఎంతమాత్రం సహించబోమని ఆయన ప్రకటించారు. కేంద్రం నిర్ణయంపై ఉమ్మడి పోరు సాగిద్దామని విపక్షాలకు ఆయన పిలుపునిచ్చారు.