: డీఎల్ఎఫ్ భూములతో మాకు సంబంధం లేదు: కేసీఆర్
డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంలో తమ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన భూ కేటాయింపుల్లో తమ ప్రభుత్వానికి ప్రమేయమెలా ఉంటుందని ఆయన గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించారు. 2013లోనే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం డీఎల్ఎఫ్ కు భూములను కట్టబెట్టిందన్నారు. మార్కెట్ రేటుకు భూములను కొనుగోలు చేసిన డీఎల్ఎఫ్, నిర్మాణాల అనుమతి కోసం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసిందని, అయితే నిబంధనలకు సదరు ప్రతిపాదనలు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే జీహెచ్ఎసీ అనుమతి నిరాకరించిందని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో విపక్షాలు ప్రభుత్వంపైనే కాక తమ కుటుంబంపై కూడా విమర్శలు చేయడం సరికాదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.