: అన్న గురించి చెబుతూ భావోద్వేగానికి గురైన అర్పిత... ఆమె తరపున నోట్ చదివిన ప్రియాంక చోప్రా
ఎక్కడో అనాధలా పెరగాల్సిన అమ్మాయి రాకుమారిలా దర్జాగా బతకడం కథలు, సినిమాల్లోనే సాధ్యం! కానీ, సల్మాన్ ఖాన్ కుటుంబం నిజజీవితంలో కూడా ఓ అమ్మాయికి అలాంటి భాగ్యాన్ని ప్రసాదించింది. ఆ అదృష్టవంతురాలి పేరు అర్పిత అని వేరే చెప్పనవసరంలేదు. రోడ్డు పక్కన దయనీయస్థితిలో కనిపించిన అర్పితను దత్తత చేసుకున్న సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ది నిజంగా పెద్ద మనసు. ఇక, తమ ఇంట అడుగుపెట్టి, తమలో ఒకరై, అనురాగ బంధంతో పెనవేసుకుపోయిన ముద్దుల చెల్లి కోరుకున్న వరుడిని తెచ్చిచ్చిన అన్న సల్మాన్ ది అంతకంటే పెద్ద మనసు! హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ వంటి చారిత్రక స్థలంలో పరిణయమాడాలనుందని చెల్లి కోరగానే, ఖర్చుకు వెనకాడని సల్మాన్ కోట్లాది రూపాయల వ్యయంతో అంగరంగవైభవంగా వివాహ మహోత్సవం జరిపించాడు... అదీ హిందూ సంప్రదాయం ప్రకారం! నిజంగా పెద్ద మనసే కదూ! అర్పిత కూడా అదే అంటుంది... "మా అన్న చాలా మంచివాడు" అని! పెళ్లి అనంతరం తనకీ భాగ్యాన్ని అందించిన కుటుంబం గురించి అర్పిత ఓ నోట్ చదివి వినిపించింది. ఈ నోట్ ను కొన్ని పంక్తుల పాటు చదవిన అర్పిత భావోద్వేగానికి గురైంది. ఇక చదవలేక తన తరపున ప్రియాంక చోప్రాను చదవాల్సిందిగా కోరింది. తన జీవితానికి అన్నలు మూలస్తంభాల్లాంటి వారని పేర్కొంది. తన పెళ్లయ్యేవరకు కూడా సొహైల్, తాను ఒకే గదిలో నిద్రించేవాళ్లమని తెలిపింది. అతను ఓ స్నేహితుడిలా మెలిగేవాడని వివరించింది. అర్బాజ్ ఓ మార్గదర్శి లాంటివాడని, ఏది మంచి, ఏది చెడు విడమర్చి చెప్పేవాడని తెలిపింది. సల్మాన్ ది పెద్ద మనసు అని, తాను ఏం చేసినా, సల్మాన్ సపోర్ట్ చేసేవాడని పేర్కొంది. ఇక, సలీం ఖాన్, సల్మా, హెలెన్ వంటి తల్లిదండ్రులను పొందడం అదృష్టంగా భావిస్తున్నానంది.