: కాల్పులు జరిపిన కానిస్టేబుల్ ఓబులేష్ చరిత్ర పెద్దదే!
నిన్న హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ వద్ద అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిపై ఏకే47తో కాల్పులు జరిపిన కేసులో... ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు ఓబులేష్ వెనుక పెద్ద చరిత్రే ఉంది. హైదరాబాద్ అంబర్ పేటలోని సీపీఎల్ గ్రౌండ్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓబులేష్... మొదట కర్నూలు ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్ గా డిపార్ట్ మెంట్ లో చేరాడు. నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ గ్రేహౌండ్స్ కు బదిలీ అయ్యాడు. గ్రేహౌండ్స్ విధుల్లో భాగంగా విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ కు వెళ్లాడు. కూంబింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓబులేష్ కు చెందిన ఏకే47 తుపాకీ విజయవాడలో మాయమైంది. అయితే ఈ విషయాన్ని ఓబులేష్ ఉన్నతాధికారులకు తెలపలేదు. ఆ తర్వాత ఏకే47 మిస్ అయినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. ఈ విషయం బయటకు పొక్కితే రచ్చరచ్చ అవుతుందని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు చడీచప్పుడు లేకుండా, ఓబులేష్ ను అంబర్ పేట్ సీపీఎల్ కు బదిలీ చేశారు. అయితే మిస్ అయిందని అందరూ భావిస్తున్న ఏకే47 ఓబులేష్ దగ్గరే ఉంది. తన దగ్గర శక్తిమంతమైన ఆయుధం ఉండటంతో ఓబులేష్ పలు విధాలుగా ఆలోచించాడు. పక్కా ప్లాన్ తయారుచేసుకుని... ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు రెడీ అయ్యాడు. ధనవంతులను కిడ్నాప్ చేసి కోట్ల రూపాయలను సంపాదించాలని స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగానే అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేయబోయి అడ్డంగా బుక్ అయ్యాడు. గతంలో కూడా ఓ కిడ్నాప్ వ్యవహారంలో లక్షల రూపాయలు సంపాదించాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఓబులేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనతో పాటు, పాత కిడ్నాప్ వ్యవహారంలో కూడా ఓబులేష్ పై విచారణ కొనసాగుతోంది.