: మా అధికారే వివరాలను లీక్ చేస్తున్నాడు: సుప్రీంకు సీబీఐ చీఫ్ వెల్లడి
తమ సంస్థలో పనిచేస్తున్న అధికారే వివరాలను బయటి వ్యక్తులకు లీక్ చేస్తున్నాడని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా సుప్రీంకోర్టుకు వెల్లడించారు. 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు చూస్తున్న డీఐజీ సంతోష్ రస్తోగి ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన కోర్టుకు చెప్పారు. తనపై లేనిపోని కథనాలను అల్లేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ తో కలసి రస్తోగి ఈ కుట్రకు తెరతీశారని, రస్తోగి తప్ప వేరెవ్వరికీ ఆ అవసరం లేదని సిన్హా చెప్పుకొచ్చారు. సంస్థ వివరాలను బయటి వ్యక్తులకు అందిస్తున్నారన్న ఆరోపణల కారణంగానే రస్తోగిని 2జీ దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించామని కూడా ఆయన కోర్టుకు తెలిపారు. అయితే ఆయనను తప్పిస్తూ సిన్హా తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రస్తోగికి తిరిగి 2జీ దర్యాప్తు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు భూషణ్, సిన్హా న్యాయవాదుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.