: తెలంగాణ ప్రజలు ఆంధ్రా దేవుడిని పూజించడం న్యాయమేనా?: రాంగోపాల్ వర్మ
సంచలనాలకు మారుపేరైన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో కొత్త వివాదానికి తెరలేపాడు. ఈ సారి ఏకంగా దేవుడినే వివాదంలోకి లాగాడు. తెలంగాణ ప్రజలకు తమ సొంత దేవుడు యాదగిరి నరసింహస్వామి ఉండగా... ఆంధ్రా వాళ్ల దేవుడైన తిరుపతి వేంకటేశ్వరస్వామిని పూజించడం సరైనదేనా? అని ప్రశ్నించాడు. తెలంగాణ ప్రజలు తిరుపతి వెంకన్నను మొక్కితే... యాదగిరి నరసింహుడిని అవమానించినట్టు తాను భావిస్తానని ట్వీట్ చేశాడు. సొంత దేశాన్ని ప్రేమించినట్లే సొంత దేవుళ్లను పూజించాలి తప్ప పొరుగు రాష్ట్రాల దేవుళ్లను కాదని చెప్పాడు. తెలంగాణ ప్రజలు వేంకటేశ్వరస్వామి కంటే యాదగిరి నరసింహస్వామిని తక్కువగా దర్శించుకుంటారని తాను అనడం తప్పుకాదు కదా? అని కూడా వర్మ ప్రశ్నించాడు. యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ అనడం తనకెంతో సంతోషం కలిగించిందని... దీంతో, తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడి విలువను గ్రహిస్తారని మరో సెటైర్ విసిరాడు. ఈ వ్యాఖ్యలపై ఎంత రాద్ధాంతం జరుగుతుందో వేచి చూడాలి మరి.