: ద్రావిడ్ మాటలు ఆ కుర్రాడి కెరీర్ ను మార్చేశాయి!
దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి సెలక్టర్లను మెప్పించిన కర్ణాటక యువకిశోరం కేఎల్ రాహుల్ ఆసీస్ పర్యటనకు ఎంపికవడం తెలిసిందే. కర్ణాటక ఆటగాడు కావడంతో సహజంగానే దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ను ఆదర్శంగా తీసుకున్నాడు. బాల్యం నుంచి ద్రావిడ్ ఆటను చూస్తూ ఎదిగిన ఈ కుర్రాడు తొలి నుంచి సంచలనాల మోత మోగించాడు. అండర్-13 విభాగంలో డబుల్ సెంచరీలు సాధించి రాష్ట్ర క్రికెట్ వర్గాలను ఆకర్షించాడు. అయితే, జూనియర్ విభాగంలో జరిగిన ఓ టోర్నీలో డబుల్ సెంచరీ సాధించిన అనంతరం రాహుల్ ద్రావిడ్ ఈ బక్కపలుచని బ్యాట్స్ మన్ తో రెండు నిమిషాలు మాట్లాడాడట. ఆ మాటలే యువ రాహుల్ లో స్ఫూర్తిని నింపాయి. ఆనాటి నుంచి అతడిలో తాను మరింత ఆత్మవిశ్వాసాన్ని చూశానని, ఆటతీరులోనూ గణనీయమమైన మార్పు కనిపించిందని రాహుల్ కోచ్ జయరాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ద్రావిడ్ మాటలే అతడి కెరీర్ ను మార్చివేశాయనడంలో సందేహం అక్కర్లేదని ఆయన అభిప్రాయపడ్డారు.