: సునంద మృతి కేసులో కొత్త కోణం...ముగ్గురు విదేశీయుల కోసం పోలీసుల గాలింపు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ హత్యతో ముగ్గురు విదేశీయులకు సంబంధముందని భావిస్తున్న పోలీసులు వారికోసం గాలింపు చర్యలను ప్రారంభించారు. సునంద మరణించిన లీలా ప్యాలెస్ హోటల్ లో సదరు విదేశీయులు ఈ ఏడాది జనవరి 13 నుంచి 18 దాకా బస చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి వీసా అనుమతులు లేకుండానే దేశంలోకి ప్రవేశించిన సదరు వ్యక్తులు పాక్, దుబాయ్ లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నకిలీ పాస్ పోర్టులు సమర్పించిన సదరు వ్యక్తులు దాదాపు ఐదు రోజుల పాటు ఆ హోటల్ లో బస చేశారని పోలీసులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే, విష ప్రయోగం కారణంగానే సునంద మృతి చెందిందని నిర్ధారించిన ఎయిమ్స్ వైద్యులు, ఏ విషాన్ని తీసుకుందన్నది మాత్రం తేల్చలేకపోయారు. దీంతో ఇతర పరీక్షల కోసం ఆమె శరీర భాగాలను పోలీసులు విదేశాలకు పంపారు.