: శ్రీనివాసన్ కు బాసటగా నిలిచిన బీసీసీఐ
ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో ముద్గల్ కమిటీ సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చెన్నైలో సమావేశమైంది. ఐసీసీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ సహ యజమాని ఎన్.శ్రీనివాసన్ కు ఈ సందర్భంగా బీసీసీఐ బాసటగా నిలిచింది. ఆయనపై ఆరోపణలన్నీ అవాస్తవాలని బోర్డు ఓ నిర్ణయానికి వచ్చింది. కమిటీ నివేదికపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మీడియాతో మాట్లాడారు. కాగా, ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందరరామన్ బుకీలతో టచ్ లో ఉండేవాడని ముద్గల్ కమిటీ తన నివేదికలో పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాజా సమావేశంలో బోర్డు సభ్యులకు సుందరరామన్ వివరణ ఇచ్చారు. దీంతో, సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా ఆయనకు సాయపడాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన గురునాథ్ మెయ్యప్పన్ (శ్రీనివాసన్ అల్లుడు) మాత్రం సుప్రీంలో వారి కేసులను వారే చూసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ స్పష్టం చేశారు.