: నేడు ‘రాజధాని’ రైతులతో చంద్రబాబు ముఖాముఖీ
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు తుళ్లూరు పరిసర ప్రాంతాల రైతులతో సమావేశం నిర్వహించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చేందుకు కొందరు రైతులు సుముఖంగానే ఉన్నా, మరికొంత మంది రైతులు ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం తుళ్లూరు మండలం రాయపూడి రైతులు ఏకంగా కేబినెట్ సబ్ కమిటీ ముందు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులను ఒప్పించేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు లేక్ వ్యూ అతిథి గృహంలో జరగనున్న ఈ భేటీకి తుళ్లూరు పరిసరాల్లోని 29 గ్రామాల నుంచి 300 మంది రైతులు హాజరుకానున్నారు. వీరిని ఆరు బస్సుల్లో హైదరాబాద్ తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భూముల అప్పగింతను వ్యతిరేకిస్తున్న రైతులు ఈ భేటీకి హాజరయ్యేందుకు నిరాకరిస్తున్నారు. భేటీలో రైతులతో పాటు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొననున్నారు.