: మోదీ మాటలతోనే సరిపెడుతున్నారు... చేతల్లేవు: బీహార్ సీఎం
ప్రధాని నరేంద్ర మోదీపై బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ధ్వజమెత్తారు. ప్రధాని చిత్తశుద్ధిని ప్రశ్నించారు. మోదీ మాటలతోనే సరిపెడుతున్నారని, చేతల్లేవని విమర్శించారు. పాట్నాలో మాంఝీ మాట్లాడుతూ, విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువస్తారని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే, మోదీ వాటిపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువస్తామని ఎన్నికల వేళ గొప్పగా ప్రచారం చేసుకున్న మోదీ ఇప్పుడు తనకేమీ పట్టనట్టు ఉంటున్నారని ఆరోపించారు. ఈ అంశంలో ప్రధాని ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశారని విమర్శించారు. అంతేగాకుండా, బీహార్ కు ప్రత్యేక హోదా అంశంలోనూ మోదీ మొండిచేయి చూపారని మండిపడ్డారు.