: ముస్లింల విషయంలో మమతా, ములాయం విఫలమయ్యారు: అసదుద్దీన్


ఆల్ ఇండియా మజ్లస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు వ్యూహ రచన జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ సీట్లు గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లాన్ వేస్తోంది. ఈ మేరకు ఓ ప్రైవేటు కార్యక్రమంలో అసదుద్దీన్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, బీహర్ ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి దింపబోమన్నారు. అయితే, యూపీ, బెంగాల్లో తప్పకుండా పోటీ చేస్తామని చెప్పారు. మహారాష్ట్రలో రెండు స్థానాలు గెల్చుకున్న అనంతరం తమ పార్టీలోని కొన్ని విభాగాల్లో కొంత అవగాహన ఏర్పడిందన్నారు. ఇదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ లో ఈసారి ఎన్నికలు ఎస్పీకి అంత తేలికగా ఏమీ జరగవన్నారు. అల్లర్లను వీరు ప్రోత్సహించారని, ముస్లింలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. దళితులు, ముస్లింలు ఒకరికొకరు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా వారు అనుమతించారని పేర్కొన్నారు. అటు బెంగాల్లో ముస్లిం కమ్యూనిటీకి ఇచ్చిన హామీలను మమతా నెరవేర్చలేదని వ్యాఖ్యానించారు. చాలా 'లౌకిక' పార్టీలు ముస్లిం కమ్యూనిటీకి ఏనాడు అధికారం ఇవ్వలేదని ఒవైసీ అన్నారు.

  • Loading...

More Telugu News