: అభిమానికి సాయపడాలని నిర్ణయించుకున్న అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సన్నిహితంగా ఉంటారు. వారి కష్టాలపట్ల స్పందిస్తారు కూడా. ఇటీవలే తన తాజా చిత్రం 'పికు' కోసం కోల్ కతాలో షూటింగ్ చేశారు. అక్కడ ఓ విద్యాసంస్థలో సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా, అక్కడ గుమిగూడిన సమూహంలో ఓ యువకుడు అమితాబ్ దృష్టిని ఆకర్షించాడు. వంటినిండా 'అమితాబ్' అన్న టాటూలతో కాస్తంత విలక్షణంగా కనిపించాడు. అయితే, అక్కడ భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండడంతో ఆ అభిమానిని కలుసుకోలేకపోయాడు బిగ్ బి. దానిపై తన బ్లాగులో పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కనిపిస్తోందని, అతనికి సాయం అవసరమేమోనని అమితాబ్ అభిప్రాయపడ్డారు. అనారోగ్యానికి సంబంధించిన పత్రాలను సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చాడని, వాటిని తాను తప్పక పరిశీలించి సాయపడేందుకు ప్రయత్నిస్తానని తన బ్లాగులో తెలిపారు.