: అండగా ఉంటాం...అధైర్యం వద్దు: రైతులకు జగన్ భరోసా
రాష్ట్రంలో రైతులకు అండగా ఉంటామని, వారి సమస్యలపై ప్రభుత్వంపై అలుపెరుగని పోరు సాగిస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సొంత జిల్లాలో పర్యటిస్తున్న జగన్ శనివారం సాయంత్రం జిల్లాలోని మైదుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా పసుపు రైతులు తమ బాధలను ఆయనకు వివరించారు. సాగులో భారీ పెట్టుబడులు పెట్టామని, కొన్ని మందుల పిచికారీతో పంటలన్నీ నాశనమైపోయాయని వారు ఆయనకు వివరించారు. పంటల నాశనానికి కారణమైన మందులను తయారు చేసిన కంపెనీలపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు జగన్ ను కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రైతులకు అండగా నిలుస్తామని, నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల రైతులు పంటల బీమాకూ నోచుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.