: సీఎం పేషీ అధికారులపై మంత్రి అయ్యన్న పాత్రుడి చిందులు!
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల బదిలీలు అధికారులు, మంత్రుల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. వేలాదిగా వచ్చిపడుతున్న సిఫారసులకు భయపడి గురువారం మంత్రులంతా అజ్ఞాతంలోకి వెళ్లగా, తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి పేషీ అధికారులపై సాక్షాత్తు ఓ మంత్రి చిందులేశారు. అధికారుల బదిలీల్లో మంత్రులకు ఏమాత్రం ప్రాధాన్యమివ్వరా? అంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు చంద్రబాబు కార్యాలయ అధికారులపై ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. సింగపూర్ పర్యటన ముగించుకుని రాగానే చంద్రబాబుకు చెప్పి మీ సంగతి తేలుస్తానంటూ ఆయన ఒంటికాలిపై లేచారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన సీఎంఓ సిబ్బంది అయ్యన్నను సముదాయించారు. అయినా కోపం తగ్గని అయ్యన్న రుసరుసలాడుతూనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.