: శాంత్రో కార్లకు వీడ్కోలు పలకనున్న హ్యుందాయ్
కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కి ఇండియాలో ఘనమైన గుర్తింపును తెచ్చిన శాంత్రో కార్లు మార్కెట్ నుంచి కనుమరుగు కానున్నాయి. 1990 దశకంలో భారత్ లోకి ప్రవేశించిన శాంత్రో కార్లు మారుతి 800కి ప్రధాన పోటీగా నిలిచాయనడంలో సందేహం లేదు. ఈ మోడల్ కార్లకు వీడ్కోలు పలకాలని హ్యుందాయ్ నిర్ణయించింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇప్పటికే 13.6 లక్షల యూనిట్లను ఇండియాలో, 5.3 లక్షల యూనిట్లను విదేశాల్లో విక్రయించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం నెలకు కేవలం 3 వేల శాంత్రో యూనిట్లు మాత్రమే అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు. నిల్వ ఉన్న శాంత్రో స్టాక్స్ అయిపోయే వరకు అమ్మకాలు సాగిస్తామని తెలిపారు. కాగా మారుతి సుజుకి సంస్థ సైతం తమ బ్రాండ్ 'మారుతి 800'కు వీడ్కోలు పలుకగా, హిందూస్తాన్ మోటార్స్ 'అంబాసిడర్' తయారీని ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే.