: జాతీయ దృక్పథం ఉన్న ఏకైక నేత చంద్రబాబు: ఐఎస్ఏఎస్ ఛైర్మన్ గోపినాథ్ పిళ్లై
భారత ముఖ్యమంత్రుల్లో జాతీయ దృక్పథం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఐఎస్ఏఎస్ (ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏసియన్ స్టడీస్) ఛైర్మన్ గోపినాథ్ పిళ్లై అన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు శుక్రవారం ఉదయం అక్కడి పారిశ్రామిక సమాఖ్య ఐఎస్ఏఎస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన చంద్రబాబు భారత్ శరవేగంగా సాధిస్తున్న వృద్ధిని ప్రస్తావించారు. భారత వృద్ధికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ప్రసంగం అనంతరం మాట్లాడిన గోపినాథ్ పిళ్లై, భారత్ లోని ముఖ్యమంత్రుల్లో జాతీయ దృక్పథమున్న ఏకైక నేత చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. విశాల దృక్పథంతో ముందుకెళుతున్న చంద్రబాబు నేతృత్వంలో ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు తమ సహకారం కూడా ఉంటుందని ప్రకటించారు.