: రోహిత్ రికార్డు స్కోరు...టీమిండియా 404/5
రోహిత్ శర్మ క్లాసీ ఆటతీరుతో ఈడెన్ గార్డెన్స్ ను ఉర్రూతలూగించాడు. శ్రీలంకతో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న నాలుగవ వన్డేలో టీమిండియా బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి రెండు ఓవర్లలో తమ ఉద్దేశాన్ని చాటిచెప్పింది. ఓపెనర్లుగా దిగిన రహానే (28), రోహిత్ (264) శ్రీలంక బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. నిలదొక్కుకుంటున్నాడనేంతలో రహానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (8) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగాడు. దీంతో స్కొరు వేగం మందగించింది. కెప్టెన్ కోహ్లీ (66) జతకలవడంతో రోహిత్ ఆటలో వేగం పెరిగింది. బౌలర్ ఎవరైనా ఒకటే ఆటతీరు. దీంతో 72 బంతుల్లో అర్ద సెంచరీ సాధించాడు. కేవలం 100 బంతుల్లో 100 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో టీమిండియా 200 పరుగులు సాధించింది. అనంతరం కోహ్లీ అర్ధ సెంచరీ సాధించి వేగం పెంచే క్రమంలో అవుటయ్యాడు. అయినా రోహిత్ ఆటలో ఏమాత్రం మార్పులేకుండా, తనకు మాత్రమే సాధికారకమైన క్లాసీ ఆటతీరుతో కేవలం 125 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. కోహ్లీ తరువాత జతకలిసిన రైనా (11) వెంటనే వెనుదిరగడంతో రోహిత్ కు ఊతప్ప (16) జతకలిశాడు. దీంతో రోహిత్ వీర విహారం చేశాడు. చివరి బంతివరకు క్రీజులో నిలిచిన రోహిత్ శర్మ 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సులతో 264 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటలకెక్కాడు. ఈడెన్ గార్డెన్స్ లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలో రెండుసార్లు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. చివరి బంతికి భారీ షాట్ కు ప్రయత్నించిన రోహిత్ అవుట్ గా వెనుదిరగడంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాగా, శ్రీలంక బౌలర్లలో మాధ్యూస్ రెండు వికెట్లు తీసుకోగా, కులశేఖర, ఎరంగ చెరో వికెట్ తీశారు. శ్రీలంక విజయలక్ష్యం 405 పరుగులు!